kcr: ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సిద్ధమైన హుస్నాబాద్.. ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్!
- ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీశ్, ఎమ్మెల్యే సతీశ్
- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు
- హెలికాప్టర్ లో చేరుకోనున్న కేసీఆర్
అందరూ ఊహించినట్లుగానే నిన్న తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెంటిమెంట్ గా మారిన సిద్ధిపేటలోని హుస్నాబాద్ లో ‘ప్రజా ఆశీర్వాద సభ’తో ఈరోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సభ విజయవంతం చేసేందుకు మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్ లు పూర్తి ఏర్పాట్లు చేశారు. సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
హుస్నాబాద్ లో ఈ రోజు సభతో ప్రారంభం కానున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం.. వచ్చే 50 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభల్లో ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే పథకాలను కేసీఆర్ హుస్నాబాద్ లో ప్రకటించే అవకాశముంది.
అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చేందుకు వీలుగా హెలిప్యాడ్ ను సభ ప్రాంగంణంలో ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం రూ.2 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. 2.30 గంటలకు కేసీఆర్ గజ్వేల్ నుంచి హుస్నాబాద్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు సభ ముగిశాక హైదరాబాద్ కు తిరిగివెళతారు. ఈ సభ కోసం ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు ఏఎస్పీలు, 10 మంది ఏసీపీలు, 85 మంది ఎస్ఐలు, 860 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తును ఏర్పాటుచేశారు.
ప్రజా ఆశీర్వాద సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. వీఐపీ కార్లకు కరీంనగర్ రోడ్డులోని విజయ పాలడైరీ స్థలంలో కేటాయించారు. వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డులో, సిద్ధిపేట రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలు తిరుమల గార్డెన్ సమీపంలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.