TRS: మా నాయకుడికే పార్టీ టికెట్ ఇవ్వరా? సెల్ టవర్ ఎక్కిన టీఆర్ఎస్ కార్యకర్త!
- మంథని టికెట్ ఇవ్వాలని డిమాండ్
- పోలీసులు బ్రతిమాలినా కిందకురాని వైనం
- అరెస్ట్ చేసేందుకు యత్నించిన అధికారులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు నగరా మోగిన వేళ పార్టీ టికెట్లు దక్కని ఆశావహులు అలక బూనుతున్నారు. మరికొందరేమో పార్టీ హైకమాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులకు టికెట్ దక్కకపోవడంపై పలువురు కార్యకర్తలు కూడా తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం మంథని టికెట్ ను పుట్టా మథుకర్ కు కేటాయించింది. దీంతో పార్టీ టికెట్ ను తమ నాయకుడు సునీల్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్త రాహుల్ రెడ్డి మంథనిలో సెల్ టవర్ ఎక్కాడు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని చాలాసేపు బ్రతిమాలినా దిగిరాలేదు. చివరికి సునీల్ రెడ్డి అక్కడకు చేరుకుని కిందకు దిగాలని కోరడంతో సెల్ టవర్ దిగాడు. ఈ సందర్భంగా రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సునీల్ రెడ్డి వర్గీయులకు వాగ్వాదం చోటుచేసుకుంది.