pre elections: ముందస్తుకు వెళ్లడం మూడు దశాబ్దాల్లో ఇది మూడో సారి!
- 1985లో ముందస్తుకు వెళ్లిన ఎన్టీఆర్
- 2004లో ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు
- ఇప్పుడు ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ రద్దైంది. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. గత మూడు దశాబ్దాలలో ఈ విధంగా ముందస్తుకు వెళ్లడం ఇది మూడోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1985, 2004లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముందస్తుకు సర్వం సిద్ధమవుతోంది.
తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే దివంగత ఎన్టీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే రామారావును తప్పించి, నాదెండ్ల భాస్కరరావు సీఎం పగ్గాలను చేపట్టారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎన్టీఆర్ సీఎం పదవిని చేపట్టారు. ఆ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఎన్టీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో 1985లో సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వామపక్షాలు, బీజేపీకి కూడా సీట్లను కేటాయించి... ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అలిపిరి బాంబు దాడి ఘటన అనంతరం ఆయన ముందస్తుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కేంద్రంలో వాజ్ పేయి నాయకత్వంలో ఉన్న ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో... ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 47 సీట్లను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది.
ఇప్పుడు తాజాగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ గడువు ఇంకా సుమారు తొమ్మిది నెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబర్ లో ఇతర నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం వేచి చూడాలి.