KCR: పదవిని త్యాగం చేయాలని కేసీఆర్ ను ఎవరైనా అడిగారా?: డీకే అరుణ
- కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేయలేదు
- కేసీఆర్ కు తన మీద తనకే నమ్మకం లేదు
- అన్ని విధాలా టీఆర్ఎస్ విఫలమైంది
అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురి చేయలేదని... ఇదంతా ముందే ఊహించినదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చెప్పారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్తే నష్టం కలుగుతుందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని... ఈ నేపథ్యంలో బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉన్న కేసీఆర్... ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కు తన మీద తనకే నమ్మకం లేదని... అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అరుణ చెప్పారు. ప్రజల కోసం పదవిని త్యాగం చేశానని కేసీఆర్ చెబుతున్నారని... పదవిని త్యాగం చేయాలని ఆయనను ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి నాయకులు బయటకు వెళ్తారనే భయంతోనే... హడావుడిగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారని చెప్పారు. 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమేమీ కాదని అన్నారు. ఒకరిద్దరు మినహా సిట్టింగులందరి పేర్లను ప్రకటించారని చెప్పారు.
కేసీఆర్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా... కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని, ఘన విజయాన్ని సాధిస్తుందని అరుణ తెలిపారు. చేతకాని దద్దమ్మలు మాట్లాడే మాటలను కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ఏం చేయాలో అర్థంకాక... కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. తన ముద్ర ఉండాలనే తపన, దోచుకోవాలనే ఆశతోనే ప్రాజెక్టుల డిజైన్లను మార్చి, అంచనాలను అడ్డగోలుగా పెంచారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ అయిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు... మూడింట్లో టీఆర్ఎస్ విఫలమైందని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల ముందు కేసీఆర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తాము మద్దతు ఇస్తామని చెప్పారని... ఇప్పుడు అదే నోటితో రాహుల్ ను విమర్శిస్తున్నారని అరుణ మండిపడ్డారు. గడప లోపల ఒక మాట, గడప దాటిన తర్వాత మరో మాట మాట్లాడటం కేసీఆర్ నైజమని విమర్శించారు.