Konda Surekha: సొంత గూటికి కొండా సురేఖ.. నేడు టీఆర్ఎస్‌కు రాజీనామా!
- తొలి విడత జాబితాలో పేరు లేకపోవడంపై అలక
- సుస్మితకు టికెట్ నిరాకరించిన కేసీఆర్
- నేడు మీడియా ముందుకు రానున్న సురేఖ
- భవిష్యత్ ప్రణాళిక ప్రకటన
టీఆర్ఎస్‌లో కొండా సురేఖ దంపతుల ప్రస్థానం నేటితో ముగియనుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి విడత జాబితాలో తన పేరు లేకపోవడంతో అలకబూనిన ఆమె, నేడు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
వరంగల్ (తూర్పు) నుంచి బరిలోకి దిగాలనుకుంటున్న సురేఖ పేరు తొలి విడత జాబితాలో లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అలాగే, తన కుమార్తె సుస్మితా పటేల్‌ను భూపాలపల్లి నుంచి బరిలోకి దించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి టికెట్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. సురేఖ అభ్యర్థనను కేసీఆర్ తిరస్కరించారు. దీంతో ఇస్తే ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలని, లేదంటే లేదని తేల్చి చెప్పమనడంతో, కేసీఆర్ ఆమె సిట్టింగ్ స్థానమైన వరంగల్ (తూర్పు)ను పెండింగ్‌లో పెట్టారు.
తనకు టికెట్ కేటాయించకపోవడమే కాకుండా తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించడంతో కినుక వహించిన సురేఖ దంపతులు పార్టీకి రాంరాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. నేడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ దంపతులు మీడియా సమావేశం నిర్వహించి టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించనున్నారు. అలాగే, భవిష్యత్ కార్యాచరణను కూడా వివరించనున్నట్టు సమాచారం.