KTR: కేటీఆర్ మోసం చేశారు: వరంగల్ నేత గండ్ర సత్యనారాయణరావు
- చర్చల సందర్భంగా టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు
- హామీ ఇవ్వడం వల్లే టీడీపీని వదిలి, టీఆర్ఎస్ లో చేరా
- స్వతంత్రంగానే బరిలోకి దిగుతున్నా
105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత... పార్టీలో అసంతృప్త పర్వం మొదలైంది. జాబితాలో పేర్లు లేని నేతలు పార్టీ హైకమాండ్ పై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. భూపాలపల్లి టికెట్ ఆశించిన గండ్ర సత్యనారాయణరావు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇస్తేనే టీడీపీకి గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. భూపాలపల్లిలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ లతో చర్చించినప్పుడు... తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని గండ్ర తెలిపారు. తీరా తనను మోసం చేశారని మండిపడ్డారు. మధుసూదనాచారి, రమణారెడ్డి, కీర్తిరెడ్డి వీరెవరూ స్థానికులు కాదని... తమ వ్యాపారాలను కాపాడుకోవడానికే వారు ప్రజల్లోకి వస్తున్నారని ఆరోపించారు. తాను స్వతంత్రంగానే బరిలోకి దిగుతున్నానని, ఆదివారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తానని, నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి, అవకాశం ఇవ్వాలని కోరారు.