Telangana: 15 లక్షల సీమాంధ్రుల ఓట్లను తొలగించేందుకు కేసీఆర్ కుట్ర!: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణ
- 2014 ఎన్నికల్లో సీమాంధ్రులు టీఆర్ఎస్ కు ఓటేయలేదు
- ఆ ఓట్లను తొలగించాలని కేసీఆర్ ఆదేశించారు
- 14 మంది అధికారులు దాన్ని అడ్డుకున్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ లో స్థిరపడ్డ సీమాంధ్రులు తమకు ఓటేయరన్న అనుమానంతోనే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. దాదాపు 15 లక్షల మంది సీమాంధ్ర ఓటర్లను తొలగించేందుకు కేసీఆర్ యత్నించారని ఆరోపించారు. 2014లో సీమాంధ్ర ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయలేదనీ, ఆ కోపంతో వీరందరి ఓట్లను తొలగించాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. అయితే ఈ తతంగాన్ని కేవలం 14 మంది అధికారులు అడ్డుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో శశిధర్ రెడ్డి మాట్లాడారు.
ఈ రకంగా ప్రజలపై జరిగే కుట్రలను తాము అంగీకరించబోమని, దాన్ని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అడ్డుకుని తీరుతుందని శశిధర్ రెడ్డి అన్నారు. తమకు గెలుపోటములు ముఖ్యం కాదనీ, న్యాయంగా ఎన్నికలు జరగాలని వ్యాఖ్యానించారు. ప్రజలు న్యాయంగా ఓటేసేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తే ఓటర్లు టీఆర్ఎస్ పనిపడతారని వెల్లడించారు. తెలంగాణకు తాగుబోతు సీఎం దొరకడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని శశిధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించేందుకు కేసీఆర్ ఒక పెగ్గు ఎక్కువ వేసుకుని వచ్చారని ఎద్దేవా చేశారు.
రెవిన్యూ మిగులు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులమయం చేశారని విమర్శించారు. ఎన్నికల తేదీలపై కేసీఆర్ ప్రకటన చేయడాన్ని ఏకంగా ఎన్నికల సంఘమే తప్పు పట్టిందని వెల్లడించారు.