Chandrababu: కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుంది: వైసీపీ నేత పెద్దిరెడ్డి
- రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు?
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు
- మాట్లాడేందుకు మైకే ఇవ్వరు.. అసెంబ్లీకి వెళ్లి ఏం ప్రయోజనం?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని... కాంగ్రెస్ తో పొత్తు వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చచ్చిపోయిందని... ఆ పార్టీ నేతలంతా కొందరు వైసీపీలోకి, మరికొందరు టీడీపీలోకి మారిపోయారని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆత్మగౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ తెలగుదేశం పార్టీని స్థాపించారరని... అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసంభవమని... అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. బీజేపీ కానీ, మరో ఫ్రంట్ కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ అధినేత జగన్ పోరాడి, ప్రత్యేక హోదాను సాధిస్తారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. తమకు మాట్లాడేందుకు మైకే ఇవ్వనప్పుడు, అసెంబ్లీకి వెళ్లి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.