sivaji: చంద్రబాబుపై ఢిల్లీ నుంచి దాడి మొదలైంది.. సోమవారం ఓ జాతీయ సంస్థ నోటీసులు ఇవ్వబోతోంది: హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు
- ఆపరేషన్ గరుడ కొత్త రూపం దాల్చుకుని, ఏపీపై తెగబడుతోంది
- సమయం చూసి చంద్రబాబుపై పంజా విసరబోతున్నారు
- ఏపీని ఇబ్బంది పెట్టడం.. భవిష్యత్ తరాలను నాశనం చేయడమే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ దాడి ప్రారంభమైందని హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని ఆయన చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని... ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారమని చెప్పారు.
బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ కొత్త రూపం దాల్చుకుని, ఏపీపై దాడికి తెగబడుతోందని శివాజీ తెలిపారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి... మహా అయితే ఓ నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు, లేదా వారం ఆలస్యం కావచ్చని... కానీ చంద్రబాబుపై దాడి మాత్రం తథ్యమని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికీ భవిష్యత్ తరాలను నాశనం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
తనకు చంద్రబాబు అయినా, జగన్ అయినా ఒకటేనని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తనకు ముఖ్యమని శివాజీ అన్నారు. ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో... ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని మండిపడ్డారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని శిక్షించేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశించారు. సమయం చూసి, దెబ్బతీసేందుకు యత్నించడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.