sivaji: చంద్రబాబునైనా, జగన్ నైనా, ఎవరినైనా సరే.. టార్గెట్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం ఏమిటి?: కేంద్రంపై శివాజీ ఫైర్
- హక్కుల గురించి మాట్లాడితే జైళ్లకు పంపుతున్నారు
- నచ్చని పార్టీలు, ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తున్నారు
- ఇదంతా పొలిటికల్ టెర్రరిజం కాదా?
హక్కుల గురించి మాట్లాడితే జైళ్లకు పంపుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై హీరో శివాజీ మండిపడ్డారు. ప్రధాని ప్రాణాలు తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ మాట్లాడతారని... ప్రధాని ప్రాణాలు తీయడం జరిగే పనేనా? అని ప్రశ్నించారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కాదా? అని అన్నారు. వరవరరావు లాంటి వాళ్లు ఇవాళ కొత్తగా ఏమీ మాట్లాడటం లేదని... ఇప్పుడు వాళ్లందరికీ 'అర్బన్ నక్సలైట్లు' అనే కొత్త పేరు పెట్టారని మండిపడ్డారు. నచ్చని పార్టీలను అణగదొక్కాలనుకోవడం, నచ్చని ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడం ఇందంతా ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి పనులకు తెగబడుతున్న మీరు పొలిటికల్ టెర్రరిస్టులు కాదా? అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
ఏపీని నాశనం చేయడమే కాకుండా, ఇక్కడి ప్రాంతీయ పార్టీలు మనుగడలో కూడా లేకుండా చేయాలనుకోవడం దారుణమని శివాజీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసి ఉంటే... రెండు నెలలు, నాలుగు నెలలు లేదా సంవత్సర కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని... ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దాడికి దిగడం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబునైనా, జగన్ నైనా లేదా ఎవరినైనా సరే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి... రాష్ట్రాన్ని నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రాణాలకు తెగించి తాను పోరాడుతున్నానని... ఈ రాష్ట్రంపై తనకున్న అభిమానమే దానికి కారణమని హీరో శివాజీ అన్నారు.