Movie: ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకువెళ్లే ‘స్క్రీన్ ఎక్స్’ థియేటర్లు!
- ఒకే హాల్లో మూడుతెరలు దీని ప్రత్యేకత
- మన చుట్టూ సన్నివేశాలు జరుగుతున్న అనుభూతి
- ఆధునిక టెక్నాలజీలో ఇదో ట్రెండ్
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ సినిమా చిత్రీకరణే కాదు వాటిని ప్రదర్శించే థియేటర్ల రూపురేఖలూ మారిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం నిర్మాణ సంస్థలకు కత్తిమీద సాములా మారింది. దీంతో ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకుని థియేటర్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. త్రీడీ, ఐమ్యాక్స్, 7డీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకు వెళ్లి ఇప్పటి వరకు అచ్చెరువొందించారు.
తాజాగా ఒకే థియేటర్లో మూడు తెరలున్న ‘స్క్రీన్ ఎక్స్’ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా థియేటర్లో 270 డిగ్రీ కోణంలో సినిమా చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రేక్షకుడు సన్నివేశాలను చూస్తున్నట్లు కాకుండా తన చుట్టూ నిజంగానే జరుగుతున్న అనుభూతికి లోనవుతాడు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి సంస్థలు సినిమాని ప్రేక్షకుల వద్దకే తీసుకువెళ్తున్న తరుణంలో ప్రేక్షకులను సినిమా హాళ్లకు తీసుకురావడానికి నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. అటువంటి ప్రయోగాల నుంచి వచ్చిందే స్క్రీన్ ఎక్స్.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దక్షిణ కొరియాకు చెందిన సీజీవీ సంస్థ అభివృద్ధి చేసింది. అయితే సాధారణ సినిమాను ఈ థియేటర్లలో ప్రదర్శిస్తే ఎటువంటి ప్రత్యేకత ఉండదు. చిత్రీకరణ సమయంలోనే ఇందుకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించాల్సి ఉంటుంది. యాక్షన్, హర్రర్ సినిమాలు ‘స్క్రీన్ ఎక్స్’ థియేటర్లలో చూస్తే ఆ అనుభూతే వేరంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇటీవల వచ్చిన ది మెగ్, యాంట్ మ్యాన్ అండ్ ది వ్యాన్స్ లాంటి సినిమాల్లో స్క్రీన్ ఎక్స్ సాంకేతికతను వాడారు. ద నన్, ఆక్వామెన్, షాజమ్ లాంటి హాలీవుడ్ సినిమాలు త్వరలో రానున్నాయి.