Rahul Gandhi: ముగిసిన రాహుల్ మానససరోవర యాత్ర... ఢిల్లీకి రాగానే రోడ్డుపై నిరసన!
- గత రాత్రి ఢిల్లీ చేరుకున్న రాహుల్ గాంధీ
- పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా ర్యాలీ
- రాజ్ ఘాట్ వరకూ పాదయాత్రతో నిరసన
తన కైలాస మానససరోవర యాత్రను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ ఉదయం భారత్ బంద్ లో పాల్గొన్నారు. పెరిగిన పెట్రోలు ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ బంద్ నకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, నిరసన తెలుపుతూ రాజ్ ఘాట్ వరకూ రాహుల్ పాదయాత్ర చేశారు. పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఈ యాత్రలో పాల్గొని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ నిరసన సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పెద్దఎత్తున మోహరించి, బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కాగా, కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో సంబల్ పూర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైలు పట్టాలపైకి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రైళ్లను అడ్డుకున్నారు. స్టేషన్ కు తాళం వేసి, ప్రయాణికులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు.