Telugudesam: టీజేఎస్ కూడా ఉంటే బాగుంటుంది... కోదండరామ్ తో నేడు టీడీపీ చర్చలు!
- సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలతో కూటమి
- మహాకూటమిలో కలవాలని కోదండరామ్ కు ఆహ్వానం
- దూరంగా ఉండాలని సీపీఎం, జనసేన నిర్ణయం
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసి, అధికారంలోకి రావాలంటే, సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలుగుదేశం, ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ఉద్యమ నేత, టీజేఎస్ (తెలంగాణ జనసమితి) అధ్యక్షుడు కోదండరామ్ ను కూడా కూటమిలో చేర్చుకోవాలని భావిస్తున్న టీడీపీ, నేడు ఆయనతో చర్చలు జరపనుంది.
ఈ క్రమంలో మరికాసేపట్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కోదండరామ్ మధ్య చర్చలు జరగనుండగా, మహాకూటమిలో చేరాలని ఆయన్ను రమణ ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడకున్నా, ఈ రెండు పార్టీలూ కలిసే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మహాకూటమికి దూరంగా ఉండాలని సీపీఎం, జనసేన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుండగా, ఆయా పార్టీలతో మరోసారి చర్చించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ భావిస్తున్నట్టు సమాచారం.