johra: ఉగ్రవాదుల దాడిలో మరణించిన తండ్రి త్వరలోనే ఇంటికొస్తాడని నమ్ముతున్న చిన్నారి కూతురు!
- షాక్ లో ఏఎస్సై రషీద్ కుమార్తె
- ఎన్ కౌంటర్ లో అమరుడైన రషీద్
- తండ్రి బతికే ఉన్నాడని అనుకుంటున్న చిన్నారి
సాధారణంగా తండ్రులు కుమార్తెలపై ఎక్కువ ప్రేమ చూపిస్తే, తల్లులు కొడుకులపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. ఆడ పిల్లలకైతే తండ్రితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తండ్రి సమయానికి ఇంటికి రాకపోయినా, అడిగిన డిమాండ్లు నెరవేర్చకపోయినా అలిగి కూర్చోవడం, తిరిగి బ్రతిమాలాక నాన్న మెడకు అల్లుకుపోవడం వీరికి మామూలే. కానీ ఆ తండ్రి ఇక ఎన్నటికీ తిరిగిరాడనీ తెలిస్తే? ఆ చిన్నారి మానసికంగా కుంగిపోదూ? తాజాగా జమ్మూకశ్మీర్ పోలీస్ ఏఎస్సై అధికారి రషీద్ కుమార్తె జోహ్రా పరిస్థితి ఇలాగే ఉంది.
జమ్మూకశ్మీర్ లో 2017, ఆగస్టు 28న జరిగిన ఉగ్రవాదుల ఆపరేషన్ లో అబ్దుల్లా రషీద్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా కుమార్తె జోహ్రో కన్నీరుమున్నీరుగా విలపించింది. తండ్రి ఇక రాడన్న బాధతో రోదిస్తున్న జోహ్రా ఫొటోలు దేశమంతటిని కదిలించాయి. ఈ ఘటన అనంతరం మానసికంగా కుంగిపోయిన చిన్నారి.. కుటుంబ సభ్యులను తరచూ ‘నాన్న ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు తిరిగివస్తారు?’ అని అడుగుతోందని జోహ్రా సోదరి బిల్కిస్ తెలిపింది. ‘ఈ సారి నాన్న ఇంటికి వస్తే ఆయన్ను అస్సలు వెనక్కి పోనివ్వను’ అంటూ జోహ్రా చెబుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో జోహ్రాను ఊరడించేందుకు నాన్న త్వరలోనే ఇంటికి వచ్చేస్తారని అబద్ధం చెబుతున్నామని వారు చెప్పారు.