jack maa: జాక్ మా ఎప్పుడు రిటైర్ అవుతారంటే.. మీడియా వార్తలపై స్పందించిన ఆలీబాబా కంపెనీ!
- 2020 వరకూ జాక్ బోర్డు డైరెక్టర్ గా ఉంటారు
- ఆలీబాబా తదుపరి చైర్మన్ గా డేనియల్ జాంగ్
- మీడియాకు లేఖ రాసిన కంపెనీ ప్రతినిధి
చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఆలీబాబా చైర్మన్ జాక్ మా త్వరలో రిటైర్ కానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం తన 54వ పుట్టిన రోజు సందర్భంగా జాక్ మా బాధ్యతల నుంచి తప్పుకుంటారని న్యూయార్క్ టైమ్స్ సహా కొన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. దీంతో ఆలీబాబా కంపెనీ ఈ విషయమై స్పందించింది.
జాక్ మా రిటైర్మెంట్ ఇప్పట్లో లేదనీ, మరో ఏడాది పాటు ఆయనే చైర్మన్ గా కొనసాగుతారని ఆలీబాబా కంపెనీ ప్రతినిధి తెలిపారు. జాక్ మా తర్వాత ప్రస్తుతం కంపెనీ సీఈవోగా పనిచేస్తున్న డేనియల్ జాంగ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. 2020 వరకూ జాక్ మా కంపెనీ బోర్డులో డైరెక్టర్ గా కొనసాగుతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికకు ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 10న అంటే.. 55వ పుట్టినరోజున జాక్ మా పదవీ విరమణ చేస్తారని ఆలీబాబా కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.