kukatpalli: కూకట్ పల్లి అభ్యర్థిని మార్చకపోతే.. కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం: టీఆర్ఎస్ నేతలు
- మాధవరం కృష్ణారావుకు నిరసనల సెగ
- అభ్యర్థిని మార్చాలంటూ టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారుల డిమాండ్
- టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వారికే అవకాశాలిస్తున్నారంటూ మండిపాటు
హైదరాబాద్ కూకటిపల్లి అభ్యర్థిగా ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణారావుకు నిరసనల సెగ తగులుతోంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు మండిపడుతున్నారు. నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జ్ తేళ్ల నర్సింగరావు పటేల్ ఆధ్వర్యంలో కృష్ణారావు చిత్రపటాన్ని నిరసనకారులు దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమకారుల వల్లే తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. కానీ, ఇప్పుడు ఉద్యమకారులను పక్కన పెట్టేశారని విమర్శించారు. ఉద్యమం సమయంలో కడుపులు మాడ్చుకున్నామని, రోడ్ల మీద కూర్చున్నామని, జైళ్లపాలయ్యామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ ఎన్నికల్లో ఉద్యమకారులను పక్కన పెట్టేశారని... టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు, పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. కూకట్ పల్లి అభ్యర్థిని మార్చకపోతే... కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.