Congress: ‘కాంగ్రెస్’ కార్యకర్తలు పార్టీ జెండాలను ఎగురవేయాలి: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
- రేపటి నుంచి 18 వరకూ కాంగ్రెస్ పార్టీ ‘జెండా పండగ’
- కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయాలి
- ఈ నెల 12న హైదరాబాద్ కు గులాం నబీ ఆజాద్
‘కాంగ్రెస్’ కార్యకర్తలు తమ ఇళ్లపైన, వాహనాలపైన పార్టీ జెండాలను ఎగురవేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి 18వ తేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ జెండా పండగ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ వస్తున్నారని, ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందని అన్నారు.
ఆరోజు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో రాఫెల్ కుంభకోణంపై ఆయన మాట్లాడనున్నారని, సంగారెడ్డిలో నిర్వహించే మైనారిటీల సభలో కూడా ఆయన పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన భారత్ బంద్ గురించి ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయితే, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకు వస్తామని అన్నారు. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నేత దానం నాగేదందర్ ఓ హోటల్ లో తనను కలిశారంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. దానం తనను కలిస్తే తప్పేంటని విలేకరులతో ఉత్తమ్ వ్యాఖ్యానించడం గమనార్హం.