konjeti rosaiah: ‘కాంగ్రెస్’కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కొణిజేటి రోశయ్య
- రోశయ్యను సన్మానించిన ఏపీసీసీ
- ‘కాంగ్రెస్’ జెండా కనబడితే ఉత్సాహం వస్తుంది
- కాంగ్రెస్ జెండా ఎప్పుడూ ఎగరాలని కోరుకుంటా
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవటానికి పార్టీ శ్రేణులు కష్టపడాలని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రోశయ్య పార్టీ ఆహ్వానం మేరకు ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏపీసీసీ సీనియర్ నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మీడియాతో రోశయ్య మాట్లాడుతూ, తాను చాలాసార్లు విజయవాడ వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి రాలేదని, ఈ రోజు రఘువీరారెడ్డి కోరిక మేరకు ఆంధ్ర రత్న భవన్ కి రావడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా కనబడితే ఉత్సాహం వస్తుందని, కాంగ్రెస్ జెండా ఎప్పుడూ ఎగరాలని కోరుకునే వారిలో తాను మొదటి వాడిగా ఉంటానని అన్నారు.
తాను విజయవాడ రావడం కూడా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, ఇప్పుడు పార్టీకి ఏమి చేయాలన్నా తనకు శక్తి సరిపోదని, ఉన్నవారు మాత్రం తమ శక్తిని కూడగట్టుకొని పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశంపై ఆయన మాట్లాడారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాను అనుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రోశయ్య అన్నారు.