Vasantha Nageswara Rao: కార్యదర్శిని బెదిరించలేదు.. క్షమించండి.. సిగ్గుపడుతున్నా: వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు
- బెదిరించలేదు.. మందలించానంతే
- నా మాటలను కుట్రతో రికార్డు చేయించారు
- చంద్రబాబుతో ఏడేళ్లు పనిచేశా.. ఆ మాత్రం తెలియదా?
గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. గొడవలెందుకని మందలించానని, అంతేతప్ప బెదిరించానన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మంత్రి ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తనవాళ్లు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని స్పష్టం చేశారు.
తన మాటలను కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేసి వదిలారని మాజీ మంత్రి ఆరోపించారు. తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. తనపై కేసు పెట్టే పరిస్థితి రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దూషించలేదని పేర్కొన్నారు. తాను చంద్రబాబు, అయ్యన్నపాత్రుడితో కలిసి ఏడేళ్లు పనిచేశానని, తానెలాంటి వాడినో ఆమాత్రం తెలియదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బురద జల్లే ముందు ఒక్కసారి ఆలోచించాలని, తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎవరినీ, ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.