Vishnu kumar Raju: చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశంసల వర్షం!
- పెట్రో, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం
- స్వాగతించిన బీజేపీ
- ప్రభుత్వాన్ని అభినందించిన విష్ణుకుమార్ రాజు
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, బీజేపీతో దూరమయ్యాక టీడీపీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీని చంద్రబాబు దునుమాడుతుంటే.. చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. అయితే, సోమవారం మాత్రం అసెంబ్లీలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే ప్రశంసలు కురిపించారు.
భగ్గుమంటున్న పెట్రోలు ధరలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ బంద్ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో పెట్రోలు ధరల ప్రస్తావన వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రజలపై పడుతున్న పెట్రోభారాన్ని ప్రభుత్వం కూడా కొంత భరించాలని నిర్ణయించిందని ప్రకటించారు. పెట్రోలు, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నుల నుంచి రెండు రూపాయలు తగ్గిస్తున్నట్టు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రజా శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమని, ధరల తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.1120 కోట్ల ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.
పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులోంచి రూ.2 తగ్గించినట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనను బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు స్వాగతించారు. పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. మంచి ఎవరు చేసినా మంచేనని, పన్ను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించారంటూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.