KCR: అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. మనస్తాపంతో గృహనిర్బంధంలోకి వెళ్లిన నల్లాల ఓదేలు!
- చెన్నూరు టికెట్ ను బాల్క సుమన్ కు ఇచ్చిన అధిష్ఠానం
- కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఓదేలు
- తనకేదైనా జరిగితే సీఎందే బాధ్యతని వెల్లడి
చెన్నూరు అసెంబ్లీ టికెట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ఈ రోజు మందమర్రిలో ఆయన తనను తాను గృహనిర్బంధం చేసుకున్నారు. తాను ఎంతగా కోరినా ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఓదేలు మనస్తాపం చెందారు.
24 గంటల్లో తనకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశాననీ, అలాంటి తనను పక్కకు తప్పించడం దారుణమని ఓదేలు వాపోయారు. తనకేదయినా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యతని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల కేసీఆర్ 105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలిజాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది ఆశావహుల పేర్లు గల్లంతయ్యాయి. చెన్నూరు టికెట్ ను టీఆర్ఎస్ అధినేత ఈసారి ఎంపీ బాల్క సుమన్ కు కట్టబెట్టారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఓదేలు రగిలిపోతున్నారు.