Telangana: కొండగట్టు మృతులకు రూ.8 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా!
- మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ ఆదేశం
- ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ రూ.3 లక్షల పరిహారం
- 45కు చేరుకున్న మృతుల సంఖ్య
జగిత్యాల జల్లాలోని కొండగట్టులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20 నుంచి 45కు చేరుకుంది. కొండగట్టు నుంచి కిందకు దిగుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు జగిత్యాల, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోవడంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు.