Vijayashanthi: టీడీపీతో పొత్తు వద్దే వద్దు.. తెగేసి చెప్పిన విజయశాంతి!
- టీడీపీతో పొత్తుపై ‘రాములమ్మ’ అభ్యంతరం
- ప్రజల్లో అభ్యంతరాలున్నాయన్న మహిళా నేత
- 15 తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవుతానన్న విజయశాంతి
తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటవుతున్న వేళ.. టీడీపీతో పొత్తు వద్దే వద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి తేల్చి చెప్పారు. తొలి నుంచీ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆమె స్వరం మరింత పెంచారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్కు అవసరమా? కాదా? అన్న విషయాన్ని అధిష్ఠానం మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీతో పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం ఉందన్నారు. ఈ నెల 15 తర్వాత నుంచి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.
నిజానికి, తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తొలి నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇటీవల హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని తెలంగాణ టీడీపీ నేతలకే వదిలేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు విషయమే తేలాల్సి ఉండగా, తాజాగా విజయశాంతి మరోమారు అభ్యంతరం చెప్పడం చర్చనీయాంశమైంది.