London: విదేశాల్లో చదువుతున్న కూతురి కోసం పన్నెండు మంది పనివాళ్లు!
- ఓ భారతీయ బిలియనీర్ ఏర్పాటు చేసిన రాజభోగం ఇది
- వివరాలు వెల్లడించిన లండన్‌లోని ఆంగ్ల పత్రిక
- సిబ్బందిని నియమించిన ‘సిల్వర్ స్పాన్’ సంస్థ
డబ్బున్న వారికి రాజభోగాలకు కొదవేముంటుంది? అన్నీ క్షణాల్లో సమకూరుతాయి. బ్రిటన్ లో చదువుతున్న తన కుమార్తెకు కూడా అలాగే ఏ విషయంలోనూ ఏ లోటూ రాకూడదని కోరుకున్న ఓ భారతీయ బిలియనీర్, కూతురికి సహాయకులుగా పన్నెండు మంది పని వారిని నియమించాడు. ఈ విషయాన్ని అక్కడి ఓ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.
స్కాట్లాండ్లోని సెయింట్ ఆండ్రూ విశ్వవిద్యాయంలో మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురిని ఓ విలాసవంతమైన భవనంలో ఉంచడమే కాదు, ఆమెను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి సౌకర్యాలు కల్పించేందుకు వీరిని నియమించారు. పన్నెండు మంది పనివారిలో ఒక హౌస్ మేనేజర్, ముగ్గురు హౌస్ కీపర్లు, ఒక గార్డెనర్, ఒక లేడీ మెయిడ్, ఒక బట్లర్, ముగ్గురు ఫూట్‌మెన్, ఒక ప్రైవేటు చెఫ్, ఒక డ్రైవర్ ఇంట్లో పనిచేస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
తమ కుమార్తె వార్డ్ రోబ్, షాపింగ్‌కు సంబంధించిన అన్ని విషయాలు సిబ్బంది చూసుకోవాలని సదరు కుటుంబం నిబంధన విధించినట్లు సిబ్బందిని నియమించిన ‘సిల్వర్ స్పాన్’ సంస్థ తెలిపింది. సిబ్బంది కోసం సదరు బిలియనీర్ కుటుంబం ఏడాదికి 30 వేల పౌండ్లు చెల్లిస్తోంది. అయితే ఆ బిలియనీర్ ఎవరన్నది మాత్రం పత్రిక వెల్లడించలేదు.