Andhra Pradesh: కేంద్రం ఇవ్వకపోతే పోలవరానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్?: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- చంద్రబాబు సర్కారు అబద్ధాలు చెబుతోంది
- ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తోంది
- పట్టిసీమలో భారీఎత్తున అవినీతి జరిగింది
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. ఓ టీవీ ఛానల్ లో ఈ రోజు జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాజు ఖండించారు. భారీ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు చిన్నచిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయని వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరి కేంద్రం నిధులు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టును ఎవరు చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పక్కా బిల్లులు సమర్పిస్తే ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. గతంలో తాను పోలవరం, పట్టీసీమ ప్రాజెక్టులను పొగిడిన మాట వాస్తవమేనని రాజు అంగీకరించారు. పట్టిసీమ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.