rampa chodavaram: రంపచోడవరం సమీపంలోని రిసార్ట్స్ నిర్వాహకుడి అరెస్టు.. రేవ్ పార్టీ ఎఫెక్ట్!
- పోలీసుల అదుపులో రమణ మహర్షితో పాటు 30 మంది
- ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ వెల్లడి
- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు చర్యలకు దిగారు. రిసార్ట్స్ నిర్వాహకుడితో పాటు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. రంపచోడవరం మండలం దేవరాతిగూడెం సమీపంలోని ఏ-1 రిసార్ట్స్‌లో ఇటీవల రేవ్ పార్టీ నిర్వహించిన విషయం వెలుగు చూసింది. దీంతో పర్యాటకం పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి రిసార్ట్స్ నిర్వాహకుడు రమణ మహర్షి అలియాస్ బాబ్జిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకపై ఏజెన్సీ ముఖద్వారాల్లో వాహనాల తనిఖీ చేపడతామని, ప్రతి స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని చెప్పారు.