vijaymalya: జైట్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ మాల్యా.. ఖండించిన జైట్లీ!
- బ్రిటన్ రావడానికి ముందు జైట్లీని చాలాసార్లు కలిశా
- రుణాలు తిరిగి చెల్లించే మార్గాలను ప్రస్తావించా
- వెస్ట్ మినిస్టర్ కోర్టు వెలుపల మీడియాతో మాల్యా
బ్యాంకు రుణాల ఎగవేతదారుడు విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్లే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని వెల్లడించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు వెలుపల ఈరోజు మాల్యా విలేకరులతో మాట్లాడుతూ, భారత్ నుంచి బ్రిటన్ రావడానికి ముందు జైట్లీని చాలాసార్లు కలిశానని, రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు చాలా మార్గాలను జైట్లీ దృష్టికి తెచ్చానని, ఈ విషయం వాస్తవమని మాల్యా పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి ఎందుకు దాచిపెట్టారు?: కేజ్రీవాల్
జైట్లీపై మాల్యా తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సమాచారాన్ని ఆర్థిక శాఖా మంత్రి ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టారు? ఈ విషయమై ఆర్థిక మంత్రి స్పందించి తీరాలని, ఈ వ్యవహారం గురించి ప్రధాని మోదీకి తెలియకుండా ఉండదని కేజ్రీవాల్ తన ట్వీట్లలో అభిప్రాయపడ్డారు.
మాల్యా ఆరోపణలు అబద్ధం: అరుణ్ జైట్లీ
మాల్యా చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ ప్రతిస్పందించారు. మాల్యా చేసిన ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, ఆ ఆరోపణలన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. 2014 నుంచి మాల్యాకు తాను అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ప్రస్తావించారు.