Kumming: చైనా నుంచి కోల్‌కతాకు బుల్లెట్ రైలు.. ప్లాన్ సిద్ధం చేస్తున్న డ్రాగన్ కంట్రీ!
- చైనాలోని కన్మింగ్ నుంచి కోల్‌కతాకు రైలు మార్గం
- మొత్తం ఆసియాను కలుపుతుందన్న చైనా కాన్సుల్ జనరల్
- మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా కోల్‌కతాకు మార్గం?
అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు నిర్మాణ పనులను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేయగా, ఇప్పుడు చైనా కూడా భారత్‌కు బుల్లెట్ రైలును నడపాలని యోచిస్తోంది. చైనాలోని నైరుతి నగరమైన కన్మింగ్ నుంచి కోల్‌కతాకు బుల్లెట్ రైలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కోల్‌కతాలోని చైనీస్ కాన్సుల్ జనరల్ మా ఝున్వు తెలిపారు. కోల్‌కతా-కన్మింగ్ బుల్లెట్ రైలు మార్గంతో ఆసియా మొత్తం కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.
ఈ రైలు మార్గం వాస్తవ రూపం దాల్చితే కేవలం కొన్ని నిమిషాల్లోనే కన్మింగ్ నుంచి కోల్‌కతా చేరుకోవచ్చని ఆయన వివరించారు. అయితే, ఇంతకుమించి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ మార్గం బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ (బీసీఐఎం) ఎకనమిక్ కారిడార్‌ను అనుసరిస్తూ మయన్మార్‌లోని మాండలే, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, ఢాకా, కోల్‌కతా మీదుగా రైలు మార్గం ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పురోగమిస్తోందని, ఇండియాతో స్థిరమైన సంబంధాలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు.