Chandrababu: చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే ఏపీకి ఐటీ కంపెనీలు భారీగా వస్తున్నాయ్!: మంత్రి లోకేశ్
- ఆయన వల్లే హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ
- గన్నవరంలో హెచ్ సీఎల్ ఆఫీస్ ప్రారంభం
- వెయ్యి ఉద్యోగాలు వస్తాయన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే రాష్ట్రంలో భారీగా ఐటీ కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ విస్తరించడానికి చంద్రబాబు గణనీయమైన కృషి చేశారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గన్నవరంలోని మేధా టవర్స్ 80 శాతం ఖాళీగా ఉండేదనీ, కేవలం 20 శాతం ప్రాంతంలోనే కంపెనీలు ఉండేవని చెప్పారు. కానీ ఈ రోజు మేధా టవర్స్ నిండిపోవడంతో పాటు పక్కన మరో బిల్డింగ్ కూడా నిర్మించామని లోకేశ్ చెప్పారు. గన్నవరంలోని మేధా టవర్స్ లో మంత్రి హెచ్ సీఎల్ స్టేట్ స్ట్రీట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కంపెనీ వల్ల ఏపీలో 1,000 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో సేవలు అందించనుందని తెలిపారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులు ఉంటే, ఆ నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారు ఉంటున్నారని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ఏర్పాటు చేసిన హెచ్ సీఎల్ ప్రతినిధులకు లోకేశ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.