kcr: కేసీఆర్, కేటీఆర్ లపై గద్దర్, విమలక్క పోటీ చేస్తారు!: కంచ ఐలయ్య ప్రకటన
- తెలంగాణకు గద్దర్, విమలక్క అసలైన వారసులు
- వీరి గెలుపుకు మిగతా పార్టీలు సహకరించాలి
- ఏ త్యాగం చేయని కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు
తెలంగాణకు జరగనున్న ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ పై ప్రజా గాయకుడు గద్దర్, కేటీఆర్ పై విమలక్కలు పోటీ చేస్తారని టీమాస్ ఫోరం ఛైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య తెలిపారు. గద్దర్, విమలక్కలు తెలంగాణకు అసలైన వారసులని చెప్పారు. రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న గద్దర్ పై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని... ఆయనకు 6 బుల్లెట్ గాయాలు తగిలాయని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం విమలక్క కాలుకు గజ్జె కట్టి ఆడిపాడారని అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వివరాలను వెల్లడించారు.
ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పై ఐలయ్య విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగం చేయని కేటీఆర్... ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కృషి చేయాలని విన్నవించారు. వీరిద్దరిపై కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు పోటీ పెట్టకూడదని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వినతిపత్రం ఇస్తామని చెప్పారు.