Mike Tyson: మైక్ టైసన్ కోసం సర్ప్రైజ్ను సిద్ధం చేసిన బప్పీ లహరి
- ఈ నెల 29న ఇండియాకు వస్తున్న మైక్ టైసన్
- పాటకు ‘ఓం స్వాగతం’ అనే పాటను జత చేసి స్వరపరిచిన బప్పీ
- టైసన్ రింగ్‌లోకి వెళ్లగానే ప్రసారం చేస్తామన్న కుమిటే లీగ్ సీఎండీ
ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ భారతదేశానికి రానున్నారు. ఈ నెల 29న భారత్‌లో జరగనున్న మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ) టోర్నమెంట్లో కుమిటే-1 లీగ్‌లో ఆయన పాల్గొననున్నారు. టైసన్ భారత్‌కు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి చాలా ఆనందపడుతూ, టైసన్ కోసం అద్భుతమైన సర్ప్రైజ్ను సిద్ధం చేశారట. గతంలో తాను స్వరపరిచిన గీతాల్లోని ఓ హిట్ గీతానికి మరో పాటను జత చేసి.. టైసన్‌కు ఆహ్వానం పలుకుతూ నూతనంగా ఓ పాటను స్వరపరిచారు.
గతంలో బప్పీ స్వరపరిచిన ‘అయామే డిస్కో డ్యాన్సర్’ పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ పాటకు ‘ఓం స్వాగతం’ అనే పాటను తాజాగా ఆయన జోడించారు. ఈ సందర్భంగా బప్పీ మాట్లాడుతూ.. ‘టైసన్ వంటి ప్రఖ్యాత బాక్సర్ మన దేశానికి వచ్చి టోర్నమెంట్లో పాల్గొనడమనేది మనకు గర్వకారణం. ఆయన వచ్చే సమయానికి నేను అమెరికాలో ఉంటాను. లేదంటే నేనే స్వయంగా ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చి ఉండేవాడిని’’ అని పేర్కొన్నారు.
బప్పీ సిద్ధం చేసిన సర్ప్రైజ్పై కుమిటే లీగ్ సీఎండీ మహ్మద్ అలీ బుధ్వాని మాట్లాడుతూ.. ‘‘టైసన్ రాబోతున్న విషయం తెలుసుకుని, ఆయన కోసం బప్పీ పాటను స్వరపరచడం అనేది అద్భుతమైన విషయం. ఆ పాటను టైసన్ రింగ్‌లోకి వెళ్లగానే ప్రసారం చేసి, దానిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బప్పీకి చూపిస్తాం’’ అన్నారు.