lottery: వరుసగా రెండు లాటరీలు... కోట్లకు పడగలెత్తిన 28 ఏళ్ల యువకుడు!
- వరుసగా రెండు లాటరీలు గెలుచుకున్న మెల్హిగ్ మెల్హిగ్
- మొదటి లాటరీ ద్వారా రూ.10కోట్లు.. రెండో దాని ద్వారా 14కోట్లు లభ్యం
- ఇది అరుదైన విషయమన్న లాటరీ అధికార ప్రతినిధి
'లడ్డూ కావాలా నాయనా' అంటూ ఒక లాటరీ పలకరించేసింది. దాన్ని తీసుకుని ఆనందించేలోపే 'మరో లడ్డూ కూడా కావాలా నాయనా' అంటూ మరో లాటరీ వచ్చి చెంత చేరింది మెల్హిగ్ మెల్హిగ్కి. ఇంతకీ ఎవరా మెల్హిగ్ అంటారా? ఆఫ్రికా పశ్చిమ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు. ఈ ఏడాది ఏప్రిల్లో అతను కొన్న లాటరీకి 1.5 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ.10కోట్లకు పైనే.. ప్రైజ్మనీ తగిలింది. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే ఆగస్టులో అతను కొన్న లాటరీకి 2మిలియన్ డాలర్లు (14కోట్లకు పైనే) తగిలాయి.
ఇంతకీ ఆ రెండు లాటరీల్లో ఎంతమంది పాల్గొన్నారో తెలుసా? మొదటి లాటరీలో 9లక్షల మంది, రెండో లాటరీలో 13 లక్షల మంది పాల్గొన్నారు. ఇలా ఒకేసారి రెండు లాటరీలు ఒకే వ్యక్తికి తగలడం అరుదైన విషయమని, అందుకు తామెంతో సంతోషిస్తున్నామని వెస్ట్రన్ లాటరీ అధికార ప్రతినిధి ఆండ్రియా మారంట్జ్ తెలిపారు.
రెండు సంవత్సరాల కిందట కెనడాకు వలస వచ్చిన మెల్హిగ్.. ఇప్పుడు కోట్లకు అధిపతి. మొదటిసారి వచ్చిన లాటరీ డబ్బుతో తన భార్యాపిల్లల కోసం ఓ ఇల్లు కొన్నానని... రెండోసారి వచ్చిన డబ్బుతో కార్ వాష్ సెంటర్, గ్యాస్ స్టేషన్ వ్యాపారాల్లో ఏదో ఒకటి ప్రారంభిస్తానని మెల్హిగ్ చెప్పాడు.