Kondagattu: ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినలేదు... తప్పంతా వారిదే: కొండగట్టు బస్సు ప్రమాదంపై కండక్టర్ స్పందన!
- రద్దీ విషయమై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు
- సమస్యను పట్టించుకోకపోగా, ఒత్తిడి పెంచారన్న కండక్టర్
- ఉత్తమ డ్రైవర్ అవార్డును అందుకున్న డ్రైవర్ శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ఘోర బస్సు ప్రమాదం 60 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొనగా, బస్సులో గాయాలపాలై, ప్రాణాలు కాపాడుకున్న కండక్టర్ పరమేశ్వర్ ప్రమాదంపై స్పందించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను టికెట్లు కొడుతూ, బస్సు చివరిలో ఉన్నానని, ఈ బస్సులో రద్దీపై పలుమార్లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని చెప్పిన పరమేశ్వర్, సమస్యను ఎవరూ పట్టించుకోకపోగా, తనపై ఒత్తిడిని పెంచారని అన్నాడు.
శ్రావణమాసం ప్రారంభమైనప్పటి నుంచి బస్సును నడుపుతున్నామని, బస్సులో 114 మంది ఎక్కగా, 96 మందికి టికెట్లు ఇచ్చానని గుర్తు చేసుకున్న ఆయన, కొంతమందికి పాస్ లు ఉన్నాయని, కొందరికి టికెట్లు ఇవ్వలేదని అన్నాడు. ఇంధనం పొదుపు చేయడంలో డ్రైవర్ శ్రీనివాస్ ఉత్తమ డ్రైవర్ అవార్డులను అందుకున్నాడని చెప్పాడు. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పిన ఆయన, ఘాట్ రోడ్డులో డ్రైవర్ న్యూట్రల్ లో ఉంచి బస్సును నడిపిస్తున్నాడన్న ఆరోపణలను ఖండించకపోవడం గమనార్హం.