Ambulance: మందుబాబులు కూడా మనోళ్లే.. తాగిపడిపోయిన వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ప్రారంభించిన వ్యక్తి!

  • తాగుబోతుల కోసం సామాజిక కార్యకర్త అంబులెన్స్ సేవలు
  • సింగిల్ ఫోన్ కాల్‌తో ఇంటి వద్ద దిగబెట్టే అంబులెన్స్
  • సేవలు పూర్తిగా ఉచితం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్యాన్ని పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో మద్య ప్రవాహం తప్పదన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు. ఈ నేపథ్యంలో ఫుల్లుగా తాగి పడిపోయినా, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయినా ప్రమాదమే.

ఇవన్నీ ఆలోచించిన మెదక్ జిల్లా జంగమరాయి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆవుల గోపాలరెడ్డి సరికొత్త ఆలోచనతో వచ్చారు. తాగుబోతుల సమస్యలు తీర్చేందుకు తనవంతు సాయం అందించేందుకు ‘అంబులెన్స్’తో ముందుకొచ్చారు. తాగి రోడ్డుపై పడిపోయిన వారిని క్షేమంగా వారి ఇంటి వద్ద దిగబెట్టే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభించారు. అంబులెన్స్‌కు పూజలు చేసిన ఆయన తొలుత ఈ సేవలను చిన్న శంకరంపేటలో ప్రారంభించారు. ఫలితంగా మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తామిక పోలీసులకు జరిమానాలు కట్టాల్సిన పనిలేదని, ప్రమాదాలు కూడా జరగవని చెబుతున్నారు.

వైన్‌షాపుల్లోని పర్మిట్ రూములు, ఇతర ప్రాంతాల్లో కూర్చుని తీరిగ్గా మందు కొట్టే వారు ఆ పని అయిపోగానే 9848867779 నంబరుకు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. కుయ్ అనుకుంటూ అంబులెన్స్ వచ్చేస్తుంది. వారిని ఎక్కించుకుని ఇళ్ల వద్ద క్షేమంగా దిగబెడుతుంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. మద్యం అలవాటు లేని గోపాల్ రెడ్డి ‘తెలంగాణ తాగుబోతుల సంఘాన్ని’ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతమాత్రాన తాను తాగుడును ప్రోత్సహించడం లేదని గోపాల్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News