West Godavari District: కొడుకు కాదు రాక్షసుడు.. ఆస్తి కోసం తండ్రిపై కుక్కను ఉసిగొల్పుతూ టార్చర్!
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- పంట రాబడిని లాగేసుకున్న వైనం
- ఎమ్మార్వోను ఆశ్రయించిన బాధితుడు
గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రికి ఓ 'పుత్రరత్నం' చుక్కలు చూపించాడు. ఆస్తి మొత్తం రాసిచ్చేయాలన్న తన డిమాండ్ కు తండ్రి అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పెంపుడు కుక్కను ఆయనపై ఉసిగొల్పాడు. ఈ బాధను తట్టుకోలేని ఆ పెద్దాయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు చిరంజీవి, కోడలు రజనీ లక్ష్మణదాసు ఇంట్లోనే ఉంటున్నారు. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన 5 సెంట్లతో పాటు మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థలాన్ని తన పేర రాయాలని చిరంజీవి తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరు కొడుకుల పేర్లపై చెరో 5 సెంట్ల భూమిని రాసేందుకు లక్ష్మణదాసు ముందుకొచ్చాడు.
కానీ చిరంజీవి ఇందుకు ఒప్పుకోలేదు. మొత్తం భూమిలో ఏడున్నర సెంట్లు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. అయినా వాటన్నింటిని ఆ తండ్రి భరించాడు. చివరికి పెంపుడు కుక్కను ఆయనపై ఉసిగొల్పి వేధించడం ప్రారంభించాడు. దీంతో సదరు పెద్దాయన ఎమ్మార్వో వి. స్వామినాయుడిని ఆశ్రయించారు. తనకు సంబంధించిన స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల రాబడిని కూడా చిన్న కుమారుడు లాగేసుకుంటున్నాడని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన వినపత్రం సమర్పించారు.