kondagattu: ఘోరం జరిగిపోయాక దిద్దుబాటు.. కొండగట్టు ఘాట్లో భారీ వాహనాల నిషేధం
- బస్సు లోయలోపడి అరవై మందికి పైగా మృతి
- ఘాట్ ప్రమాద హేతువని తెలిసినా పట్టని అధికారులు
- తాజాగా అధికారుల చర్యలపై విమర్శలు
ఘోరం జరిగిపోయింది. అరవై మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీరుబాటుగా ఇప్పుడు అధికారులు మేలుకున్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను నిషేధిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇటీవల ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోను, ఆస్పత్రిలోనూ అరవై మందికి పైగా చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాద హేతువని ఎప్పటి నుంచో ప్రయాణికులు మొత్తుకుంటున్నా అధికారులు స్పందించలేదు. చివరికి జరగరానిది జరిగాక స్పందించారంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.