Telugudesam: దమ్ముంటే ఆంధ్రాలో అడుగుపెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయండి.. చూద్దాం!: వర్ల రామయ్య సవాల్
- దేశంలో నియంత పాలన నడుస్తోంది
- తెలంగాణ ఎడారిగా మారకూడదనే ఆందోళన చేశాం
- కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీకావడంపై టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం జర్మనీ నియంత హిట్లర్, పాక్ సైనిక నియంత ఆయూబ్ ఖాన్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయకత్వంలో తామంతా బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లామనీ, ఆందోళన చేపట్టామని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ వాదిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్ ఎందుకు మౌనం వహించారని వర్ల రామయ్య ప్రశ్నించారు. విజయవాడలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సీఎం పదవి నుంచి దిగిపోవాలని అప్పట్లో డిమాండ్ చేసినందుకే మోదీ ప్రభుత్వం చంద్రబాబును కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు చేపడితే బీజేపీ దేశంలో ఎక్కడా మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఈగ వాలినా ఊరుకోబోమనీ, జరిగే నష్టానికి బీజేపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అసలు రైతుల తరఫున పోరాడిన వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం తప్పు చేస్తోందనీ, వెంటనే నాన్-బెయిలబుల్ వారెంట్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.