Social Media: సోషల్ మీడియా కారణంగా పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోంది!: ఐఏఎఫ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

  • నిద్రలేమితో ప్రతికూల ప్రభావం పడుతోందన్న ధనోవా
  • గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ కావాలని వ్యాఖ్య
  • అభివృద్ధి చేయాలని ఐఐఏఎస్ కు విజ్ఞప్తి

సోషల్ మీడియా కేవలం యువతపైనే కాదు ఆర్మీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రహస్యాలను దొంగిలించేందుకు శత్రుదేశాలు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కారణంగా భారత పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోందని వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తెలిపారు.

సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపటం కారణంగా పైలెట్లు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. దీని కారణంగా సిబ్బంది మధ్య సమన్వయం దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన 57వ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.

‘మందు తాగితే గుర్తించడానికి బ్రీత్ అనలైజర్ ఉన్నట్లుగానే సరిగ్గా నిద్రపోయిన వారిని గుర్తించడానికి ప్రత్యేక పరికరాలు లేవు’ అని ధనోవా తెలిపారు. నిద్రపోని పైలెట్లను గుర్తించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్(ఐఐఏఎస్) ను ధనోవా కోరారు.

  • Loading...

More Telugu News