moon: చంద్రమండల యాత్రకు టికెట్ బుకింగ్ షురూ!
- చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్స్ సర్వీస్‌ని ప్రారంభించిన స్పేస్-ఎక్స్ కంపెనీ
- బిగ్ ఫాల్కన్ అనే రాకెట్‌ను సిద్ధం చేసిన కంపెనీ
- తొలి ప్రయాణికుడి వివరాలను ఈనెల 17న వెల్లడిస్తామన్న మస్క్
చంద్రమండల యాత్రకు మొదటి టికెట్ అమ్ముడైంది. త్వరలో మనం పక్క ఊరికి వెళ్లినంత సులభంగా చంద్రుని మీదకు వెళ్లి రావచ్చు. దీనికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ వ్యోమగాములు మాత్రమే చంద్రుని మీదకు వెళ్లి చరిత్ర పుటల్లో నిలిచారు. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా వెళ్లొచ్చని ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్‌ని ప్రారంభించింది. దీని కోసం బిగ్ ఫాల్కన్ అనే రాకెట్‌ను కూడా సిద్ధం చేశారు. అంతేకాదు, టికెట్ అమ్మకాలు కూడా ఇటీవల ‘స్పేస్-ఎక్స్’ ప్రారంభించింది. ఇటు ప్రారంభమైందో లేదో అప్పుడే ఒక టికెట్ కూడా అమ్ముడైపోయింది.
అయితే తొలి పర్యాటకుడి వివరాలను మాత్రం ఈనెల 17న వెల్లడిస్తామని టెస్లా కంపెనీ సీఈవో అయిన ఎలాన్ మస్క్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఈ యాత్రలో వ్యోమగాముల్లా చంద్రునిపై దిగటం ఉండదట. చంద్రుని చుట్టూ రాకెట్లో మాత్రమే చక్కర్లు కొడతారట. దీనికి కారణం వ్యోమగాములు శిక్షణ తీసుకుని ఉంటారు కాబట్టి చంద్రునిపై దిగినా అక్కడి పరిస్థితులను తట్టుకోగలరు. కానీ సామాన్య ప్రయాణికులు తట్టుకోలేరని ఇలా చేస్తున్నారు. ఏదిఏమైనా, గతంలో చంద్రుడి మీదకు వెళ్ళొచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ వంటి వ్యోమగాముల సరసన త్వరలో కొందరు సామాన్యుల పేర్లు కూడా చేరబోతున్నాయి.