Ram Mandir: రామమందిర నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమవుతుంది: బీజేపీ నేత రామ్ విలాస్ వేదాంతి
- రామ మందిరాన్ని అయోధ్యలో కట్టేస్తాం
- మసీదును లక్నోలో కడతాం
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ విలాస్ వేదాంతి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమవుతుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి తెలిపారు. అయోధ్యలో ఉన్న మసీదును లక్నోలో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో హిందూ, ముస్లింలు కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వేదాంతి వ్యాఖ్యలపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఖాలిద్ రషీద్ ఫరంగి మహిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయోధ్య కేసు పెండింగ్‌లో ఉండగా, పలువురు నాయకులు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గతనెలలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కోసం చట్టాన్ని తీసుకొస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో తమకు పూర్తి మెజారిటీ ఉండడంతో ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి మకుట్ బిహారీ వర్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తమదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వేదాంతి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం కోసం రామ భక్తులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.