amit shah: జమిలీకి వెళదామన్న కేసీఆర్ అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు!: బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శ
- టీఆర్ఎస్ కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం
- అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తాం
- విమోచన దినం నిర్వహించే దమ్ముందా?
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో సమర్ధించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. కానీ 9 నెలలు ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళుతున్నారని విమర్శించారు. తాజా నిర్ణయంతో కేసీఆర్ ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తరహాలో కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న షా.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తన కుటుంబ పాలనను సుస్ధిరం చేసుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని షా విమర్శించారు. 2014లో తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తారన్న కేసీఆర్.. ఇప్పటివరకూ మాట నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కేవలం వాస్తు పిచ్చితో సచివాలయానికి నాలుగున్నరేళ్లుగా రాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఇంతవరకూ ఆదుకోలేదనీ, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కడతామన్న కేసీఆర్.. ఇప్పటివరకూ లబ్ధిదారులకు ఎన్ని ఇళ్లను అందించారని షా ప్రశ్నించారు.
జిల్లాల పునర్విభజనను బీజేపీ స్వాగతించిందనీ, దీని కారణంగా పాలన మెరుగుపడుతుందని భావించామని షా తెలిపారు. కానీ ఇప్పటివరకూ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు కాలేదనీ, ప్రజలకు సేవలు అందడం లేదని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన రైతులను అరెస్ట్ చేయించారనీ, సిరిసిల్లలోని నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీసుల చేత కొట్టించిన ప్రభుత్వం కేసీఆర్ దేనని షా విమర్శించారు. రైతుల పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు మద్దతుధరను కేంద్రం ప్రకటించిందని షా గుర్తుచేశారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించడంతో పాటు తెలంగాణ విమోచన దినాన్ని పాటించగలరా? అని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అమిత్ షా సవాలు విసిరారు. ఇవి చేయలేని పార్టీలు తెలంగాణకు ఎన్నటికీ న్యాయం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని షా ప్రకటించారు. కేసీఆర్ ను మరోసారి గెలిపించాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు.