yarraballi dayakar rao: అప్పట్లో 1,000 మందిని తీసుకెళ్లి బాబ్లీ పనుల్ని అడ్డుకున్నా.. అర్ధరాత్రి ఫొటోలు తీసి సుప్రీంకోర్టులో పెట్టా!: ఎర్రబెల్లి దయాకర్
- నా సాక్ష్యాన్నే సుప్రీం పరిగణనలోకి తీసుకుంది
- నన్ను 10 రోజులు జైలులో పెట్టారు
- కాంగ్రెస్ పార్టీ కారణంగానే బాబ్లీ ప్రాజెక్టు కట్టారు
తెలంగాణకు నష్టదాయకంగా మారిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తొలుత పోరాడింది తానేనని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు పనులు మొదలు అయ్యాయని వెల్లడించారు. అప్పట్లో అటువైపు పశువులు, గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన కొందరు వ్యక్తులు దీన్ని గమనించి పోచారం శ్రీనివాసరెడ్డికి చెప్పారన్నారు. తామిద్దరం అక్కడికి వెళ్లగా శంకుస్థాపన మాత్రమే జరిగిందనీ, పని ఇంకా మొదలు కాలేదని చెప్పారు. దీంతో ఈ ప్రాంతం ఫొటోలు తీసుకుని సీఎం, ప్రధాని, రాష్ట్రపతి సహా అందరినీ కలిశామన్నారు.
ఈ ప్రాజెక్టును ఇప్పుడు అడ్డుకోకుంటే భవిష్యత్ లో చాలా ఇబ్బంది అవుతుందని తాను చెబితే ఎవ్వరూ పట్టించుకోలేదని దయాకర్ రావు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే 1,000 మందిని తీసుకెళ్లి అక్కడ పనుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాననీ, దీంతో 10 రోజులు తనను జైలులో పెట్టారని చెప్పారు. దీనిపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాక టీఆర్ఎస్ నేత వినోద్, కాంగ్రెస్ నేత మధుయాష్కి, చివరికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేశాయని దయాకర్ రావు వెల్లడించారు.
ఈ కేసులో ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవనీ, తాను అర్ధరాత్రి పూట బాబ్లీ దగ్గరకు వెళ్లి డ్యామ్ ఫొటోలు తీసుకొచ్చానని దయాకర్ రావు పేర్కొన్నారు. తాను సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. బాబ్లీ నిర్మాణం అడ్డుకోవడం పట్ల రాజశేఖరరెడ్డి ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. బాబ్లీ కేసులో తనకు ఇప్పటివరకూ నోటీసు అందలేదనీ, కానీ వచ్చే అవకాశముందని వ్యాఖ్యానించారు.