KTR: కేసీఆర్ ఇప్పటికీ జ్వరంతోనే బాధపడుతున్నారు!: కేటీఆర్
- వైరల్ ఫీవర్, దగ్గు, జలుబుతో కేసీఆర్ బాధ పడుతున్నారు
- అనివార్య పరిస్థితుల్లోనే గవర్నర్ ను కలిశారు
- కొండగట్టు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొండగట్టు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంతో బాధపడ్డారని చెప్పారు. కొండగట్టు ప్రమాదస్థలికి కేసీఆర్ పోలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయని.... సీఎం వెళ్లకపోవడాన్ని తాను కూడా సమర్థించనని... కానీ, ఇప్పటికీ ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారని చెప్పారు.
అనివార్య పరిస్థితుల్లోనే గవర్నర్ ను కలిసేందుకు కేసీఆర్ వెళ్లారని తెలిపారు. కొండగట్టు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, తీవ్ర విచారం వ్యక్తం చేశారని చెప్పారు. ఘటనాస్థలికి సీఎం వెళ్లారా? లేదా? అనే విషయాన్ని వివాదాస్పదం చేయరాదని అన్నారు. ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే విషయాలపైనే చర్చ జరగాలని చెప్పారు. తొలి విడతలో ప్రకటించిన వారందరికీ బీఫామ్ ఇస్తారా? లేదా? అనే విషయం తనకు తెలియదని... దానికి సమాధానం పార్టీ అధ్యక్షుడే చెప్పాలని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు స్పందించారు.