forensic report: ఢిల్లీ సామూహిక మరణాల కేసులో ట్విస్ట్: ఆత్మహత్యలు కాదంటున్న ఫోరెన్సిక్ నివేదిక
- 11 మంది కుటుంబ సభ్యుల సామూహిక మరణాలు
- విస్తుగొలిపే నిజాన్ని వెల్లడించిన ఫోరెన్సిక్ నివేదిక
- మోక్షం కోసం క్రతువు నిర్వహిస్తుండగా ప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఆమధ్య ఒకే కుటుంబానికి చెందిన 11 మంది విగతజీవులై కనిపించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఉదంతంలో విస్తుగొలిపే నిజం ఒకటి ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెల్లడైంది. పోలీసులు తొలుత భావించినట్టుగా ఆ కుటుంబానిది ఆత్మహత్య కాదని తేలింది. జూలై 1న బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్ దేవీ సహా 10 మంది కుటుంబసభ్యులు విగత జీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ ఇంట్లో లభ్యమైన ఆధారాలను బట్టి వీరంతా సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఈ కేసులో 'సైకలాజికల్ అటాప్సీ' (ఆత్మహత్య చేసుకున్న వారి గురించి లోతైన మానసిక విశ్లేషణ) నిర్వహించాలని న్యూఢిల్లీ పోలీసులు సీబీఐని కోరడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను పోలీసులకు సీబీఐ అందించింది. ఈ నివేదిక ద్వారా బురారీ కుటుంబం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యలకు పాల్పడలేదని.. అసలు ఆ కుటుంబంలో ఎవరికీ చనిపోవాలన్న ముందస్తు ఆలోచనే లేదనే విషయం వెల్లడైంది. మోక్షం కోసం క్రతువు నిర్వహిస్తుండగా, అందులో సూచించిన విధానాన్ని వారు అనుసరించడంతో జరిగిన ప్రమాదం కారణంగానే వారంతా చనిపోయినట్టు సైకలాజికల్ అటాప్సి నివేదికలో పేర్కొన్నారు. ఆ ఇంట్లో లభించిన ఆయా వ్యక్తుల నోట్ పుస్తకాలు, డైరీలను లోతుగా విశ్లేషించడంతో పాటు, వారి స్నేహితులను, బంధువులను ఇంటర్వ్యూలు చేసి సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ నివేదికను రూపొందించింది. ఆ కుటుంబానికి చెందిన పెద్ద కొడుకు దినేశ్ సింగ్, అతని సోదరి సుజాత నెగ్ పాల్ ను కూడా ఈ నివేదిక కోసం ఇంటర్వ్యూ చేయడం జరిగింది.