Amit Shah: మీరు చేయాల్సింది మీరు చేయండి... నేను చేయాల్సింది నేను చేస్తా: తెలంగాణ నేతలతో అమిత్ షా
- ఏడాది నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు
- తరచూ వచ్చి ప్రచారాన్ని పర్యవేక్షిస్తా
- బీజేపీ నేతలతో అమిత్ షా
తాను ఏడాది నుంచి చెబుతున్నా తెలంగాణ బీజేపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇకనైనా ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, స్థానిక నేతలకు క్లాస్ పీకారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని, అందుకు రెడీగా ఉండాలని తాను చెబుతున్నా, నేతలు సరిగ్గా స్పందించలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో బీజేపీ తెలంగాణ నేతలు, జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ లతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
రాష్ట్ర నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలని, పైనుంచి తాను చేయాల్సింది తాను చేస్తానని అమిత్ షా వెల్లడించారు. అప్పటివరకు కేవలం 2 శాతం ఓటింగ్ ఉన్న త్రిపురలో అధికారాన్ని చేపట్టామని గుర్తు చేసిన ఆయన, తెలంగాణలోనూ అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని అన్నారు. బూత్ లెవల్ నుంచి కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. పొత్తులపై అనుమానాలు ఎవరికైనా ఉంటే చెప్పాలని సూచించిన ఆయన, మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనని అన్నారు. తాను తరచూ రాష్ట్రానికి వచ్చి, బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.