Akhilesh Yadav: పకోడీ ప్రభుత్వం కావాలో.. ఎక్స్ప్రెస్ వే ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుంటారు: అఖిలేశ్ యాదవ్
- మోదీ ప్రభుత్వంపై అఖిలేశ్ విమర్శలు
- వచ్చే ఎన్నికల్లో సైకిల్వాలాకే ఓటేయాలని పిలుపు
- కాంగ్రెస్, బీఎస్పీతో కూటమిపై స్పష్టత
పకోడీలు అమ్మే ప్రభుత్వం కావాలో, ఎక్స్ప్రెస్ వే ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుంటారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. పెరుగుతున్న పెట్రో ధరలను అదుపు చేయలేకపోవడాన్ని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్వాలాకే (ఎస్పీ) ఓటేయాలని యువతకు పిలుపునిచ్చారు.
పెట్రోలు ధరలను ప్రస్తావిస్తూ సైకిలుకు పెట్రోలు అవసరం లేదని, సైక్లింగ్ వల్ల ఆరోగ్యం కూడా సొంతమవుతుందని అన్నారు. అంతేకాదు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా సైకిలు నేర్పిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తాము నిర్మించిన మెట్రోలో దక్షిణ కొరియా అధ్యక్షుడితో కలిసి మోదీ ప్రయాణించారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. కేవలం 9 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను మోదీ ఘనంగా ప్రారంభించారని, కానీ, తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎక్స్ప్రెస్ వేపై విమానాలు కూడా ల్యాండ్ కావచ్చని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ పనీ చేయకుండా ప్రజలకు నీతి వాక్యాలు చెబుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. పని చేయడం మానేసి చెరుకు తింటే మధుమేహం వస్తుందని.. కాబట్టి దానిని తినొద్దని చెబుతున్నారని విమర్శించారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉద్యోగమేనన్న మోదీ వ్యాఖ్యలపైనా అఖిలేశ్ మండిపడ్డారు. తమకు పకోడీ ప్రభుత్వం కావాలో, ఎక్స్ప్రెస్ వే ప్రభుత్వం కావాలో ప్రజలు త్వరలోనే తేలుస్తారని అఖిలేశ్ అన్నారు.