Petrol: సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు పెట్రోలు ధర!
- 'పెట్రో' ఉత్పత్తుల ధరలను పెంచిన ఓఎంసీలు
- ముంబైలో రూ. 89.29కి చేరిన లీటరు పెట్రోలు ధర
- ఢిల్లీలో రూ. 81.91
పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి సామాన్యునికి ఉపశమనం ఇప్పట్లో లభించేలా కనిపించడం లేదు. పెట్రోలు ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఈ ఉదయం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశ రాజధానిలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.91కి, డీజిల్ ధర రూ. 73.72కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర ఏకంగా రూ. 89.29కి చేరగా, డీజిల్ ధర రూ. 78.26కు పెరిగింది.
దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే 'పెట్రో' ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, డాలర్ తో మారకపు విలువలో బలహీన పడుతున్న రూపాయి కూడా ధరల పెరుగుదలకు తోడవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది.