BJP: ప్రతిపక్షాలపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి అక్షయ్, మోహన్‌లాల్, మాధురీ దీక్షిత్!
- ప్రతిపక్షాలను దెబ్బకొట్టే వ్యూహం
- 70 మంది ప్రముఖులను ఇప్పటికే ఎంపిక చేసిన బీజేపీ?
- బరిలో సినీ, క్రీడా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు
వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోమారు దేశాన్ని పాలించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ పాలిటిక్స్‌లో ‘సర్జికల్ స్ట్రయిక్’కు పావులు కదుపుతోంది. ప్రత్యర్థులను కోలుకోలేకుండా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. సెలబ్రిటీలను, సినిమా స్టార్లను రంగంలోకి దించడం ద్వారా విజయావకాశాలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో 70 మంది ప్రముఖులను రంగంలోకి దించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. వీరిలో సినిమా, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
సినీ రంగం నుంచి అక్షయ్ కుమార్, సన్నీడియోల్, మాధురీ దీక్షిత్, మోహన్‌లాల్, క్రికెట్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ తదితరులను బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్టు బీజేపీ నేత ఒకరు వెల్లడించారు. వారందరూ దేశ ప్రజలకు చిరపరిచితులని, కాబట్టి విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ భావిస్తోంది. అక్షయ్ కుమార్‌ను న్యూఢిల్లీ నుంచి, గుర్దాస్పూర్ నుంచి సన్నీడియోల్‌ను, ముంబై నుంచి మాధురీ దీక్షిత్‌ను, తిరువనంతపురం నుంచి మోహన్‌లాల్ ను లోక్‌సభ బరిలోకి దించాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించేసిందని ముఖ్య నేత ఒకరు తెలిపారు.