Hyderabad: హెల్మెట్ తో వెళుతున్నా... ఆటో ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం!
- హైదరాబాద్ శివార్లలో ఘటన
- ఇద్దరు స్నేహితులతో కలసి బైక్ పై శ్రీనిధి
- అతివేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు
హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై వెళుతున్నా, మృత్యువు తరుముకొచ్చింది. హైదరాబాద్ శివార్లలోని పేట్ బషీర్ బాద్ లో ఓ బైకును ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థి శ్రీనిధి ఉపాధ్యాయ (18) దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, బెంగళూరుకు చెందిన కృష్ణయ్య, న్యూ బోయిన్ పల్లిలో కర్రీ పాయింట్ నడుపుతూ, తన కుమారుడు శ్రీనిధిని కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదివిస్తున్నాడు. నిన్న కాలేజీ ముగిసిన అనంతరం, తన మిత్రులు నవీన్ చారీ, రమేష్ లతో కలసి బైకుపై కొంపల్లికి వస్తున్న వేళ, ట్రాలీ ఆటో ఢీకొంది.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శ్రీనిధి తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే అతని ప్రాణాలు పోగా, మిగతా ఇద్దరినీ, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. హెల్మెట్ ధరించినా, అతి వేగం ప్రాణాలు తీసిందని పోలీసులు వ్యాఖ్యానించారు. కుమారుడి మరణంతో కృష్ణయ్య దంపతులు తీరని శోకంలో మునిగిపోయారు.