Virat Kohli: 30 మంది ఆటగాళ్లలో... ఒక్క కోహ్లీపైనే ఒత్తిడి పడుతోందా?: సెలెక్టర్లపై సందీప్ పాటిల్ ఫైర్
- ఆసియా కప్ లో పాకిస్థాన్ ను ఎదుర్కోబోతున్నాం
- ఈ మ్యాచ్ భావోద్వేగాలతో కూడుకున్నది
- ఇలాంటి టోర్నీ నుంచి కోహ్లీకి విశ్రాంతిని ఎలా కల్పిస్తారు?
ఆసియా కప్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని కల్పించడంపై మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ మండిపడ్డారు. వెస్టిండీస్ టోర్నీ కోసం కోహ్లీని ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై ఫైర్ అయ్యారు. వెస్టిండీస్ టూర్ లో గెలవడం కాన్నా, ఆసియా కప్ ను గెలవడమే ముఖ్యమని చెప్పారు. ఆసియా కప్ లో పాకిస్థాన్ ను భారత్ ఎదుర్కోబోతోందని, ఈ మ్యాచ్ భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, ఇలాంటి టోర్నీకి అత్యున్నత ఆటగాళ్లను బరిలోకి దింపాల్సి ఉంటుందని అన్నారు.
ఏ టోర్నీకి ప్రధాన్యత ఇవ్వాలో, ఏ టోర్నీలో ఎవరికి విశ్రాంతిని కల్పించాలో తెలిసుండాలని పాటిల్ మండిపడ్డారు. గతంలో సెలెక్టర్ గా వ్యవహరించిన తనకు... ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో తెలుసని అన్నారు. ఆసియా కప్ లో కోహ్లీని ఆడించి... వెస్టిండీస్ టూర్ కు విశ్రాంతిని ఇవ్వాల్సి ఉండాల్సిందని చెప్పారు. బీసీసీఐ కాంట్రాక్టులో 30 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు... ఒక్క కోహ్లీపైనే ఒత్తిడి ఎందుకు పడుతోందని ప్రశ్నించారు.